రంగంలోకి దిగిన శరద్‌ పవార్‌ భార్య

26 Nov, 2019 12:57 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బలపరీక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్‌ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్‌ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్‌ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అజిత్‌ పవార్‌పై ఎన్సీపీ ఒత్తిడి
శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్సీపీకి ఆ పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ చివరిక్షణంలో ఝలక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్‌.. రేపటి బలపరీక్షలో కీలకం కానున్నారు. అజిత్‌ పవార్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజిత్‌ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్‌ పవార్‌తో మంగళవారం శరద్‌ పవార్‌ కుటుంబసభ్యులు మంతనాలు జరిపారు. శరద్‌ పవార్‌ భార్య రంగంలోకి దిగి.. అజిత్‌తో మాట్లాడారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఎన్సీపీ గూటికి వస్తే.. శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అజిత్‌కు వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఎన్సీపీ నేతలు ఒత్తిడి.. అటు బీజేపీ నేతలు ఆశల నేపథ్యంలో అజిత్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. బుధవారం నాటి బలపరీక్షలో అజిత్‌ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అజిత్‌ బీజేపీ సర్కారును కూల్చుతారా? లేక నిలబెడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని వార్తలు