బీజేపీ తీరుపై మండిపడ్డ ఎన్సీపీ

16 Nov, 2019 14:06 IST|Sakshi

ముంబై : తమకు 119 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం దారుణన్నారు. వారి మాటలు నిజమే అయితే గవర్నర్‌ అడిగినపుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమానికి అంగీకారం తెలిపిన శివసేన, కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు అప్పగించేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్‌, ఎన్సీపీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ పదవులను పంచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత చంద్రకాంత్‌ పాటిల్‌... స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తమకు మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ సుముఖంగా ఉన్నారని.. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఇది సాధ్యమని చెప్పుకొచ్చారు. 

ఈ క్రమంలో చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యలపై నవాబ్‌ మాలిక్‌ స్పందించారు. ‘ బీజేపీ నాయకులు ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లో ధైర్యం నింపే వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మా చేతిలో(ప్రభుత్వ ఏర్పాటు విషయమై) ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తించడం లేదు. అవును వాళ్లకి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ నిజాలను అంగీకరించకతప్పదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 105 సీట్లు సంపాదించుకున్న బీజేపీకి అయినా, మరే ఇతర పార్టీలకైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం కదా అంటూ ఎద్దేవా చేశారు. శివసేన, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు