మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!

25 Nov, 2019 08:26 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ.. ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్లకు తరలించి.. వారు జంప్‌ కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. అయినా ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను  ఆకర్షించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైలోని రెనైజాన్స్‌ హోటల్‌లో మఫ్టీలో తిరుగుతున్న ఇద్దరు పోలీసులను ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్‌ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రెనైజాన్స్‌ హోటల్‌లో మఫ్టీలో పోలీసులు కనిపించడంతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్‌ నుంచి హోటల్‌ హయత్‌కు ఆదివారం సాయంత్రం మార్చింది. ముంబై పొవైలోని రెనైజాన్స్‌ హోటల్‌లో మఫ్టీలో ఇద్దరు పోలీసులు కనిపించడంతో వారిని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్‌ నిలదీశారు. పోలీసుల ఐడీ కార్డులు చెక్‌చేసిన ఆయన..  ‘ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు  ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ తిరుగుతున్నారని చెబితే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో బీజేపీ తరఫున పోలీసులు గూఢచర్యం నెరుపుతున్నారని, ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్‌లో బీజేపీ కూడా రూమ్‌లు బుక్‌ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్‌ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని లలిత హోటల్‌లో ఉంచింది.

మరిన్ని వార్తలు