‘మహా’ రాజకీయాలపై ఎన్సీపీ వ్యంగ్య కార్టూన్‌

30 Oct, 2019 12:23 IST|Sakshi

ముంబై:  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ సందిగ్దతపై ఎన్‌సీపీ అధికార ప్రతినిధి క్లైడో క్రాస్టో సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఓ కార్టూన్‌ వేసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. శివసేన  పార్టీ అధికార గుర్తు అయిన బాణం...బీజేపీ చిహ్నం కమలానికి గురి ఎక్కుపెట్టినట్లుగా కార్టూన్‌ను చిత్రీకరించారు. కాగా గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కింగ్‌ మేకర్‌గా అవతరించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ సంకేతాలు జారీ చేస్తూ బీజేపీని హెచ్చరిస్తోంది.(చదవండి : బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు)

మరోవైపు మహారాష్ట్రకు మరో ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రినని దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ముంబైలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50ఫార్ములా పాటిస్తామని వారికి చెప్పలేదు. మా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సైతం శివసేనకు సిఎం పదవి ఇవ్వడంపై  ఏనాడు హామీ ఇవ్వలేదు. వచ్చే ఐదేళ్ల పాటు కూటమితో కలిసి స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం మహించనుంది. మాకు పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలాగే మరో ఐదుగురు కూడా మాకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు’ అని తెలిపారు.


 

మరిన్ని వార్తలు