చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ పాలన: మోదీ

7 Sep, 2019 18:25 IST|Sakshi

ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ-2 ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో మెట్రో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ తమ పాలన ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధించామని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే జల్‌ జీవన్‌ మిషన్‌, ముస్లిం మహిళలకు ఊరట కలిగించే ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, చిన్నారుల భద్రతను పటిష్టపరిచే చట్టాలు తమ పాలనలో మైలురాయిగా నిలిచాయని మోదీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుత తరాలను అభివృద్ధి బాట పట్టించడంతో పాటు భావితరాల కలలు, ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చెందడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముంబైలో మెట్రో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టును రూ.20,000 కోట్లతో మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ముంబై ప్రజల జీవన విధానం సులభతరమవ్వడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్నప్పుడు ఏకకాలంలో నగరాలు అభివృద్ది చెందడం అత్యవసరం అని మోదీ తెలిపారు. వీటి కోసం వచ్చే ఐదేళ్ళలో తమ ప్రభుత్వం 100 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు