బిహార్‌లో సీట్ల పంపకం

24 Dec, 2018 06:00 IST|Sakshi
ఢిల్లీలో పాశ్వాన్, నితీశ్‌లతో కలసి మీడియాతో మాట్లాడుతున్న అమిత్‌ షా

బీజేపీ, జేడీయూలకు చెరో 17 సీట్లు, ఎల్జేపీకి ఆరు

న్యూఢిల్లీ: 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు బీహార్‌లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీల మధ్య సీట్ల పొత్తు కుదిరింది. మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 సీట్లు, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ మిగిలిన ఆరు సీట్లలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయం వెల్లడించారు. పాశ్వాన్‌ను ముందుగానే రాజ్యసభకు నామినేట్‌ చేయనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు. మోదీ ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రిగా ఉన్న పాశ్వాన్, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌తో చర్చల అనంతరం షా ఈ వివరాలు వెల్లడించారు.

2014లో గెలిచిన 31 సీట్లకు మించి ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌ఎల్‌పీ అధికార కూటమి నుంచి నిష్క్రమించిన తరువాత ఆ అవకాశాన్ని ఎల్జేపీ సమర్థంగా ఉపయోగించుకుంది. బీజేపీనుంచి సంతృప్తికర స్థాయిలో సీట్లను దక్కించుకుంది. నితీశ్‌కుమార్‌ సైతం ఎన్డీయేలో తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. 2014లో బీజేపీ పోటీ చేసి గెలిచిన అయిదు సీట్లను సైతం నితీశ్‌కుమార్‌ తన వాటాగా దక్కించుకున్నారు.

2014లో జేడీ(యూ) స్వతంత్రంగా పోటీ చేయగా, బీజేపీతో కలిసి పోటీచేసిన ఎల్జేపీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో పోటీచేసే అభ్యర్థుల జాబితాతో త్వరలోనే అన్ని పార్టీలూ ఒక నిర్ణయానికి వస్తాయని అమిత్‌షా వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సమర్థంగా పనిచేసిందని పాశ్వాన్‌ అన్నారు. మోదీ నేతృత్వంలోనే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్లోని హాజిపూర్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయంపై నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యానిస్తూ, పాశ్వాన్‌ దీర్ఘకాలంగా దేశానికి చేసిన సేవకు ఇది గుర్తింపు అని అన్నారు.

మరిన్ని వార్తలు