జేడీ(యూ)17, బీజేపీ17, లోక్‌ జనశక్తి 6

17 Mar, 2019 17:13 IST|Sakshi

పాట్నా : బీజేపీ, జనతాదళ్‌(యునైటెడ్‌), లోక్‌ జనశక్తి పార్టీల పొత్తు నేపథ్యంలో పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. అధికార ఎన్‌డీఏ కూటమి తరుపున బీహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల తరుపున పోటీ చేయనున్న స్థానాలపై బీజేపీ  ఉపాధ్యక్షుడు అమిత్‌షా స్పష్టతనిచ్చారు. ఆదివారం బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన అమిత్‌షా ఈ మేరకు సీట్ల పంపకాన్ని పూర్తి చేశారు. జేడీ(యూ), బీజేపీలు తలా 17 స్థానాల్లో పోటీ చేయనున్నాయని సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్‌షా పేర్కొన్నారు. ఇక కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)కి ఆరు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. కాగా ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన నితిష్‌ కుమార్‌ బీహార్‌లో కరువు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలకు సహాయం చేయాలని కోరారు.

పాతమిత్రులందరూ..ఒక్కటయ్యారు..
2014 బిహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో చేతులు కలిపినా ఇంచుమించుగా ఒంటరి పోరాటమే చేసింది. విభేదాల కారణంగా చిరకాల మిత్రుడు నితీష్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌)తో ఎన్నికలకు ముందే తెగదెంపులు చేసుకోవడం కమలనాథులకు కలిసి వచ్చింది. కానీ ఈ అయిదేళ్లలో పరిస్థితులు మారాయి. పాత మిత్రులందరూ మళ్లీ చేతులు కలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ, నితీష్‌ కుమార్‌ జేడీ (యూ), రామ్‌విలాస్‌ పాశ్వానే నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీల మధ్య పొత్తు పొడిచింది. అయితే లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆర్‌జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాగఠ్‌ బంధన్‌ నుంచి గట్టి పోటీయే ఉంది. అందుకే కుల సమీకరణలు, కేంద్రం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలనే నమ్ముకొని బీజేపీ ప్రచారం చేస్తోంది.

మరిన్ని వార్తలు