రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ

9 Aug, 2018 04:32 IST|Sakshi
జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌

ఉదయం 11గంటలకు ఎన్నిక

ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌.. విపక్ష అభ్యర్థి హరిప్రసాద్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌ బుధవారం నామినేషన్‌ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్‌ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్‌ కాంగ్రెస్‌ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది.

గెలుపు మాదంటే మాదే!
కాంగ్రెస్‌కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు. హరిప్రసాద్‌ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రసాద్‌ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్‌ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లుఎన్డీయే బలపరిచిన  అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది.  

కూటముల బలాబలాలు
బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్‌కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్‌ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్‌ సింగ్‌లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్‌ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది.

విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్‌ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్‌ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్‌ సభ్యుడు, మరో ఇండిపెండెంట్‌ ఎంపీ హరిప్రసాద్‌కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్‌ ఎంపీలు స్పష్టం చేశారు.  

ఎన్నికల ప్రక్రియ
సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్‌గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు