నాగాలాండ్‌లో బీజేపీ కూటమి హవా..!

3 Mar, 2018 13:28 IST|Sakshi

సాక్షి, కోహిమా‌: త్రిపురలో అధికార సీపీఎంకు బీజేపీ షాకివ్వగా.. నాగాలాండ్‌లో తమ మిత్రపక్షంతో కలిసి అధికారం చేపట్టనుంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్‌ అధికారం కోల్పోయేలా కనిపిస్తుంది. బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 32 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో 5 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాలకు (31 సీట్లు) ఒకట్రెండు తక్కువ వచ్చినా స్వతంత్రుల మద్ధతుతోనైనా అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి భావిస్తోంది.

నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టగా.. ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, 18 స్థానాల్లోనే బరిలో దిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ పరాభవం తప్పడం లేదు. కనీసం ఒక్క స్థానంలోనూ నెగ్గేలా కనిపించడం లేదు. బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ జోస్యం చెప్పినట్లుగానే త్రిపురను బీజేపీ నేరుగా సొంతం చేసుకోనుండగా, నాగాలాండ్‌లో ప్రధాన మిత్రపక్షం ఎన్‌డీపీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎన్‌డీపీపీ చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మేఘాలయాలో మాత్రం బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు