వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు

8 Sep, 2018 13:48 IST|Sakshi

సాక్షి, పెందూర్తి : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ నమ్మకాన్ని వైఎస్‌ జగన్‌ నిలబెడతారు: రామ్‌ కుమార్‌
ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి నెలకొల్పారని నేదురుమల్లి రామ్‌కుమార్‌ అన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జననేత వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఉన్న రెండు ఆప్షన్స్‌లో ప్రజలు అనుభవం వైపు మొగ్గు చూపారన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఈ సారి వైఎస్‌ జగన్‌కు అవకాశమివ్వాలని యోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

దీంతోనే నేదురుమల్లి వర్గంతో మాట్లాడి పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనార్థన్‌ రెడ్డి, వైఎస్సార్‌లు చాలా సన్నిహితంగా ఉండేవారని, వారి చాలా దగ్గరి నుంచి చూశానని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. జనార్థన్‌ రెడ్డి తన చివరి ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేశారని, లక్ష 75 వేల ఓట్లతో  గెలుపొందారని తెలిపారు. నెల రోజుల క్రితమే పార్టీలో చేరాలనుకున్నా.. పాదయాత్ర విశాఖ చేరేవరకు ఎదురుచూశానని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు