నాగా సీఎంగా రియో ప్రమాణం

9 Mar, 2018 03:00 IST|Sakshi

కోహిమా: నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నేత నీఫియు రియో బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆ రాష్ట్ర గవర్నర్‌  ఆచార్య.. రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పాట్టూన్‌ ప్రమాణం చేశారు. వీరుకాక మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ ప్రభుత్వాన్ని రియో ఏర్పాటు చేశారు. మార్చి 16 లోగా అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని రియోను గవర్నర్‌ కోరారు.

నాగా సీఎంగా రియో బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెణ్‌ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌తోపాటు తాజా మాజీ ముఖ్యమంత్రి జెలియాంగ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు, త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం కొలువుదీరనుంది. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.

మరిన్ని వార్తలు