టీడీపీకి వరుస షాక్‌లు

9 Oct, 2019 14:04 IST|Sakshi

సాక్షి, నెల్లూరు/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు నచ్చక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. టీడీపీ నేత కువ్వారపు బాలాజీతో పాటు వందలాది మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. వీరిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చూసి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ తెలిపారు.

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు..
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ఆడారి ఆనంద్ సమక్షంలో మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. నవరత్నాలు పథకాల ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. రైతు భరోసా, పింఛన్ల పెంపు, అమ్మఒడి పథకాలు ప్రవేశ పెట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. (చదవండి: వైఎస్సార్‌ సీపీలోకి ఆకుల, జూపూడి)

మరిన్ని వార్తలు