రాజీనామా బాటలో ఎంజే అక్బర్‌?

12 Oct, 2018 02:59 IST|Sakshi

చుట్టుముట్టిన లైంగిక వేధింపుల ఆరోపణలు

నైజీరియా పర్యటన అర్ధంతరంగా ముగించుకునే చాన్స్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: ‘మీ టూ’ ప్రచారంలో భాగంగా మహిళా జర్నలిస్టులు పలువురు తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామాకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పదవి నుంచి తప్పుకోవడం మినహా మరో మార్గం ఆయనకు లేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్‌..పర్యటనను అర్థంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకుంటారని భావిస్తున్నారు. కాగా, అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టుల సంఖ్య పదికి చేరుకుంది. వీరంతా 1980ల నుంచి ఎంజే అక్బర్‌ వద్ద వివిధ పత్రికల్లో వివిధ సమయాల్లో పనిచేసిన వారే.

మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నాయకత్వం మౌనం వహించగా అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం సీరియస్‌గా ఉంది. ఆయన పదవికి రాజీనామా చేయాలంటోంది. అసలే ఎన్నికల సమయం..పైగా రాఫెల్‌ డీల్‌పై పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం మంత్రి అక్బర్‌ రూపంలో ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇవ్వదలుచుకోలేదు. విదేశీ పర్యటన నుంచి స్వదేశం వచ్చిన వెంటనే మంత్రి రాజీనామా సమర్పించడం మంచిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా కాకుండా, ఆయన ప్రత్యారోపణలకు పూనుకుంటే పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఒక వేళ ప్రధానిని కలిసి నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తానని చెప్పినా కూడా ఆరోపణలను అంగీకరించినట్లే అవుతుందని అంటున్నాయి. ఈ ఆరోపణలపై మంత్రి అక్బర్‌ ఎలాంటి వివరణ ఇచ్చినా అది సంతృప్తికరం కాబోదు. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా పది మంది మహిళలు ఆరోపిస్తున్నందున వివరణ పరీక్షకు నిలబడలేదని బీజేపీ నేత ఒకరన్నారు. ఎలాంటి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా మౌనంగా వైదొలగడమే అక్బర్‌ ముందున్న ఏకైక అవకాశమని అన్నారు. అదే జరిగితే, పాత్రికేయ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మంత్రి ఎంజే అక్బర్‌కు అవమానకరమైన నిష్క్రమణ అవుతుంది.  కాగా,అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిరాకరించారు.

మరిన్ని వార్తలు