జార్ఖండ్‌లో నూతన శకం: సోరేన్‌

23 Dec, 2019 18:20 IST|Sakshi
తన నివాసంలో సైకిల్‌ తొక్కుతున్న హేమంత్‌ సోరేన్‌

రాంచి: జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడం పట్ల జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్‌ సోరేన్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ కూటమికి విజయాన్ని అందించిన జార్ఖండ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

‘కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేఎంఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. మా కూటమికి ప్రజలు పట్టం కట్టారు. మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు, మద్దతుదారులకు ధన్యవాదాలు. నన్ను నమ్మి, మద్దతు తెలిపినం‍దుకు లాలూ ప్రసాద్‌, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ నాయకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రోజు నుంచి జార్ఖండ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. కులం, మతం, వృత్తి బేధాలు లేకుండా అందరి ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీయిస్తున్నాన’ని హేమంత్‌ సోరేన్‌ అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలను మైలురాయిగా ఆయన వర్ణించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీకి సంపూర్ణ ఆధిక్యం రావడంతో జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరేన్‌ ఎన్నిక కానున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. జేఎంఎంకే డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా అని హేమంత్‌ సోరేన్‌ను విలేకరులు ప్రశ్నించగా కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించడంతో తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఆయన ఉల్లాసంగా గడిపారు. సైకిల్‌ తొక్కుతూ సందడి చేశారు. (మోదీ, అమిత్‌ షాలకు గర్వభంగం)
 

మరిన్ని వార్తలు