ఎన్నికలయ్యాకే ప్రధాని అభ్యర్థిని చెప్తాం

10 Jun, 2018 04:33 IST|Sakshi

జేడీఎస్‌ ప్రధాన కార్యదర్శి డానిష్‌ అలీ

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాలని జేడీఎస్‌ ప్రధాన కార్యదర్శి డానిష్‌ అలీ అన్నారు. బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలన్నారు. గతంలో 3 సందర్భాల్లో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎంపిక జరిగిందన్నారు. ‘ఎన్నికల తర్వాతే వీపీ సింగ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1996లో కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటైన యునైటెడ్‌ ఫ్రంట్‌ హెచ్‌డీ దేవెగౌడను ప్రధానిగా చేసింది. అదేవిధంగా, ఎన్నికల అనంతరమే యూపీఏ–1 హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఎంపికయ్యారు’అని ఆయన చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల తర్వాతే నాయకత్వం అంశం నిర్ణయమవుతుందని అన్నారు. ఏకాభిప్రాయంతోనే ప్రధానమంత్రిని నిర్ణయించడం జరుగుతుందన్నారు.

ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అసలు లక్ష్యమే దెబ్బతింటుందని తెలిపారు. కాంగ్రెస్‌ లేకుండా రూపొందే ప్రతిపక్ష కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదన్నారు. గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కేవలం 31శాతం మాత్రమే పొందిన బీజేపీ ప్రతిపక్షం లేని భారత్‌ తెస్తానంటూ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తే 28 లోక్‌సభ స్థానాలకు గాను 25పైగానే గెలుచుకుంటాయన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల కోసం కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తాయన్నారు. జేడీఎస్, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని విభేదాలున్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ ఐదేళ్లూ జేడీఎస్‌కే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ లిఖితపూర్వకంగా అంగీకరించిందన్నారు.

మరిన్ని వార్తలు