ఒడిశా, అరుణాచల్‌ సీఎంల ప్రమాణం

30 May, 2019 04:09 IST|Sakshi
ఒడిశా సీఎంగా ప్రమాణం చేస్తున్న నవీన్‌ పట్నాయక్‌, అరుణాచల్‌ సీఎంగా ప్రమాణంచేస్తున్న పెమా

భువనేశ్వర్‌/ఈటానగర్‌: ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నూతన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజు జనతా దళ్‌ (బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గవర్నర్‌ గణేశీలాల్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది నూతనంగా ఎన్నికైన బీజేడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణంచేశారు.147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేడీ 112 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలో 2000 సంవత్సరం నుంచి బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. నవీన్‌ వరుసగా 2000, 2004, 2009, 2014ల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘పట్నాయక్‌కు అభినందనలు. ఒడిశా అభివృద్ధికి కేంద్రం నుంచి మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’అని మోదీ ట్వీట్‌ చేశారు.  

అరుణాచల్‌ సీఎంగా పెమా ఖండూ
బీజేపీ సీనియర్‌ నేత పెమా ఖండూ అరుణాచల్‌ ప్రదేశ్‌ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఈటానగర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మంది కేబినెట్‌ మంత్రులు పెమా ఖండూతో పాటు ప్రమాణం స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్‌ సీఎంలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక రోజు. మా ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తుంది’ అని అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది.

మరిన్ని వార్తలు