‘5 లక్షల కోట్ల’ లక్ష్యం సాధిస్తాం

7 Jul, 2019 04:17 IST|Sakshi
వారణాసిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ

తాజా బడ్జెట్‌ అందుకు రోడ్‌ మ్యాప్‌: ప్రధాని మోదీ

వారణాసిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

వారణాసి: దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో రూ.340 లక్షల కోట్ల (5 లక్షల కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పుపట్టేవారంతా నిపుణులైన నిరాశావాదులని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి, నవభారత్‌ ముందుకు దూసుకెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 118వ జయంతిని పురస్కరించుకుని వారణాసిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన..‘5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యం అవసరం ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. లక్ష్య సాధనకు మార్గాలు చూపడం బదులు విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇటువంటి వారిని నేను నిపుణులైన నిరాశావాదులంటాను. సాధారణ ప్రజానీకం గురించి వారికి పట్టింపు ఉండదు. వారిని మీరు ఏదైనా సలహా అడిగితే, మిమ్మల్ని సమస్యల పాలుచేస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘లక్ష్య సాధనలో చర్చలు, విమర్శలు కూడా అవసరమే. కానీ, లక్ష్యాన్ని తప్పుపట్టడం మాత్రం సరికాదు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు.

తలసరి ఆదాయం, వినియోగం, ఉత్పాదకత పెంపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసేందుకు 2019–20 బడ్జెట్‌ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని, నవభారత్‌ సాధన దిశగా దేశాన్ని ముందుకు దూసుకుపోయేలా చేస్తుందని ప్రధాని అన్నారు. ‘కేక్‌ ఎంత పెద్దదన్నదే అసలు విషయం. పెద్ద కేక్‌ అయితే, ఎక్కువ మందికి వస్తుంది. అదే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రోడ్లు, నౌకాశ్రయాలు వంటి మౌలిక రంగాల అభివృద్ధికి, అందరికీ గృహకల్పన, దేశీయ ఉత్పత్తిరంగం అభివృద్ధి వంటి వాటికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలతో మమేకం కావాలి
పార్టీ సభ్యత్వంపై ప్రధాని మాట్లాడుతూ..‘అన్ని వర్గాల ప్రజలను పార్టీతో మమేకం చేయాలి. పార్టీతో కలిసి దేశానికి రాయబారులు మాదిరిగా పనిచేయడానికి సభ్యత్వ నమోదు ఉపయోగపడాలి’ అన్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన వారణాసి విమానాశ్రయం వద్ద మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ప్రధాని నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం ‘ఆనంద్‌ కానన్‌’ను ప్రారంభించారు. జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘జాతి సమగ్రతకు ఆయన అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. ఆయన గొప్ప విద్యావేత్త, జాతీయవాది’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు