దేవుని సాక్షిగా

20 May, 2018 07:05 IST|Sakshi

నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 

రాజ్యమేలిన ఉద్విగ్నత 

ఐదుగురు చొప్పున ప్రమాణం 

అధికార పక్షం, విపక్షం, కొద్దిసేపట్లో ఎవరు అటు ఇటు అవుతారో తెలియని ఉత్కంఠ, అధికారం నిలుపుకోవాలని ఒకరు, చేజిక్కించుకోవాలని మరొకరి ఆరాటం. అందరి మనసుల్లోనూ ఒకటే కలవరం, ఈ పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ శనివారం తొలిసారిగా కొలువు తీరింది. నూతన సభ్యులు దేవుని సాక్షిగా, రైతుల సాక్షిగా, ఒకరిద్దరు సత్యం సాక్షిగా ప్రమాణం గావించారు. 

సాక్షి, బెంగళూరు: ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశం అయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఎంతో ఉద్వేగంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సమయానికే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన 10 నిమిషాలకు హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష„ý  స్థానంలో, బీజేపీ ఎమ్మెల్యే అధికారపక్షం వైపు కూర్చొన్నారు. సభలో హెచ్‌డీ రేవణ్ణ మాట్లాడుతూ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని ప్రొటెం స్పీకర్‌ను కోరగా, ఆ మేరకు అనుమతించారు.

 మధ్యాహ్నం కల్లా ప్రధాన నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్, జమీర్‌ అహ్మద్‌ తదితరులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, సోమశేఖర్‌రెడ్డి, ప్రతాప్‌గౌడలు మధ్యాహ్నం వరకు శాసనసభకు హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటలోపల చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. మీడియా గ్యాలరీలో కూర్చొని జాతీయ నేతలు అనంత్‌కుమార్, శోభ, గులాంనబీ ఆజాద్, మునియప్ప తదితరులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎమ్మెల్యేలందరూ దేవుడు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దాదాపు 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. 

అనంతరం తాత్కాలిక స్పీకర్‌ గోపయ్య సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆనంద్‌సింగ్, ప్రతాప్‌ గౌడ ఆచూకీ లభించకపోవడంతో వారు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో వ్యక్తమయింది. గత బడ్జెట్‌ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశమవడంతో ఎమ్మెల్యేలందరితో శాసనసభ కళకళలాడింది. ఎమ్మెల్యేల ముఖాల్లో ఉత్సాహంతో పాటు ఉద్విగ్నత కూడా కనిపించింది. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా?, ఓడిపోతారా?అనే సందిగ్ధం అందరిలోనూ వ్యక్తమైంది. 

యడ్యూరప్ప దేవునిపై, సిద్ధరామయ్య సత్యంపై 
సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ‘ముఖ్యమంత్రి’ యడ్యూరప్ప మొదటగా ఎమ్మెల్యేగా.. దేవుని పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సత్యప్రమాణంగా ప్రమాణ స్వీకారం గావించారు. కొత్త ఎమ్మెల్యేలతో విధానసభ కార్యదర్శి ఎస్‌.మూర్తి ప్రమాణం చేయించారు. సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ పరీక్ష ముగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం 03.30గంటలకు 221 మంది ఎమ్మెల్యేలు చకచకా ప్రమాణం చేశారు. కనిపించకుండా పోయి కాంగ్రెస్‌ను కలవరపెట్టిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్‌లు సభ ప్రారంభమవడానికి అర్ధగంట ముందు విధానసౌధలో ప్రత్యక్షమవడంతో హమ్మయ్య అనుకున్నారు. 

కుమార, డీకే ఒకేసారి 
జేడీఎస్‌ నుంచి కుమారస్వామి, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత డీకే శివకుమార్‌లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయగా, అందరూ ఆసక్తిగా గమనించారు. గత మూడు రోజులుగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. 

డీకే శివకుమార్‌ పేరిట ప్రమాణం 
అసెంబ్లీలో అందరూ దైవం, సత్యం, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కుణిగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్‌ రంగనాథ్‌. డీకేకు అత్యంత ఆప్తునిగా పేరు పొందిన రంగనాథ్‌ ఆయన పేరు మీద ప్రమాణం చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. మొదటి సారి ఎన్నికల్లో గెలుపొందిన కేజీఎఫ్‌ ఎమ్మెల్యే రూపా శశిధర్‌ ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలో తెలియక కాసేపు సందిగ్ధంలో పడ్డారు.  

మరిన్ని వార్తలు