తొలి పది పదిలం

28 May, 2019 03:26 IST|Sakshi
రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, ప్రకాశ్‌ జవదేకర్‌

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ముమ్మర కసరత్తు

రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ తదితరులకు స్థానం

పీఎంఓలో మార్పులపైనా ఊహాగానాలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్‌ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్‌ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి.  

వీరి స్థానాలు పదిలం
పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్‌ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్‌ చంద్‌ గెహ్లోత్, ప్రకాశ్‌ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్‌లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే  జైట్లీ, సుష్మా స్వరాజ్‌లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్‌ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.  

బెంగాల్‌కు ప్రాధాన్యత
పశ్చిమబెంగాల్‌లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్‌ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్‌ ఛటర్జీ, సుభాష్‌ సర్కార్, జయంత్‌ సర్కార్‌లకు బెంగాల్‌ నుంచి కేబినెట్‌లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్‌లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి.

కేబినెట్‌ కార్యదర్శిగా రాజీవ్‌ గౌబా!
గౌబా 1982 బ్యాచ్‌ జార్ఖండ్‌ కేడర్‌ అధికారి
న్యూఢిల్లీ: కొత్త కేబినెట్‌ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్‌ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా  హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్‌ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్‌ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్‌ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు.

ఈయన జార్ఖండ్‌ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయన కేబినెట్‌ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు.

మరిన్ని వార్తలు