గోవా కొత్త సీఎం.. ఎమ్మెల్యే కాని వ్యక్తేనా?

18 Mar, 2019 12:57 IST|Sakshi

ఎమ్మెల్యే కాని వ్యక్తికే పగ్గాలు ఇవ్వాలి

12 మంది ఎమ్మెల్యేల డిమాండ్‌ 

పనాజీ: గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ కన్నుమూయడంతో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంకీర్ణ కూటమికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యే కాని వ్యక్తినే కొత్త సీఎంగా ఎన్నుకోవాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు గోవా ఫార్వర్డ్‌ పార్టీకి చెందిన వారు కాగా, మరో ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), ఇంకో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర ముగ్గురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.

ఎమ్మెల్యే కాని వ్యక్తి సీఎం అయితే.. ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోపు అంటే అప్పటికీ లోక్‌సభ ఎన్నికలు ముగుస్తాయి. మరోవైపు గోవా సీఎం రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నార్త్‌ గోవా ఎంపీ శ్రీపాద నాయక్‌, రాజ్యసభ సభ్యుడు వినయ్‌ టెండుల్కర్‌, గోవా అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే తదితరులు తదుపరి సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

పరీకర్‌ మృతితో గోవాలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా రాజకీయ పార్టీల మంతనాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఓ హోటల్‌లో సమావేశమవ్వగా.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని, బీజేపీకి మిత్రపక్షాల మద్దతు లేకపోవడంతో.. ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని గవర్నర్‌ను కోరింది.

మరిన్ని వార్తలు