యోగికి షాకిచ్చిన బీజేపీ నేత

16 Oct, 2019 16:59 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతే షాక్‌ ఇచ్చారు. ఝాన్సీలో ఇటీవల జరిగిన పుష్పేంద్ర యాదవ్‌ ఎన్‌కౌంటర్‌ కేసు సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్విటర్‌లో కోరారు. పుష్పేంద్ర యాదవ్‌ను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ, యూపీ బీజేపీ నాయకుడు, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ నిరాహువా వారితో గొంతు కలిపారు. పుష్పేంద్ర యాదవ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన వెనుక నిజానిజాలను వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను దినేశ్‌లాల్‌ ట్విటర్‌లో కోరారు.

ఈ ట్వీట్‌ ఆదిత్యానాథ్‌ సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. పుష్పేంద్రయాదవ్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం కాదని, కరుడుగట్టిన నేరగాడైన అతను పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడని సీఎం యోగి ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన ఝాన్సీలో స్థానిక మోతే ఇన్‌స్పెక్టర్‌ ధర్మేంద్ర సింగ్‌ జరిపిన కాల్పుల్లో పుష్పేంద్ర యాదవ్‌ మృతి చెందారు. పోలీసులను చూడగానే మొదట పుష్పేంద్ర కాల్పులు జరిపాడని, దీంతో తాము జరిపిన ప్రతి కాల్పుల్లో  అతను మరణించాడని ఇన్‌స్పెక్టర్‌ చెప్తున్నారు. పుష్పేంద్ర కుటుంబసభ్యులు మాత్రం పోలీసులు ఉద్దేశపూరితంగానే హతమార్చారని ఆరోపిస్తున్నారు. పుష్పేంద్ర కుటుంబసభ్యులను ఇటీవల పరామర్శించిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. తాము అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అలీగఢ్‌ నుంచి పోటీచేసిన దినేశ్‌లాల్‌ యాదవ సామాజికవర్గం ఒత్తిడి మేరకే ఈ ట్వీట్‌ చేసినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు