సీతారామన్‌ వ్యాఖ్యల పట్ల విస్మయం

7 Feb, 2018 18:02 IST|Sakshi
డస్సాల్ట్‌ ఫైటర్‌ జెట్‌

సాక్షి, న్యూఢిల్లీ : 36 డసాల్ట్‌ రాఫేల్‌ యుద్ధ విమానాలను ఏ రేటుకు కొనుగోలు చేస్తున్నారు? ఒక్కో విమానానికి ఎంతవుతుంది? మొత్తం 36 విమానాలకు ఎత్తవుతుంది? అంటూ ఫ్రాన్స్‌ కంపెనీతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ రాజ్యసభలో ఓ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ససేమిరా అన్నారు.

ఈ విమానాల కొనుగోలు ఓ పెద్ద స్కామ్‌ అంటూ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించినప్పటికీ విమానాల ధర వివరాలను వెల్లడించడానికి వెనకాడారు. పైగా ‘ఇది భారత్, ఫ్రాన్స్‌ అంతర్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. రాజ్యాంగంలోని 10వ అధికరణం కింద దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. బహిర్గతం చేయలేం’ అని తెగేసి చెప్పారు.

నిర్మలా సీతారామన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు ప్రతిపక్షాన్నే కాకుండా అటు పాలకపక్షాన్ని కూడా విస్మయానికి గురి చేసి ఉంటుంది. రాఫేల్‌ యుద్ధ విమానాలకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నలు సంధించినప్పుడు ఈ విమానాల కొనుగోలులో ప్రజల సొమ్ము ఉన్నందున ఒక్కో విమానానికి ఎంతయిందో, మొత్తం విమానాలకు ఎంతయిందో ఒప్పందం వివరాలు అందుబాటులోకి వచ్చాక తప్పకుండా వెల్లడిస్తానని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కూడా ఈ ప్రశ్న వెలువడినప్పుడు ‘కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికీ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధానంగా ఉన్న తేడా పారదర్శకత. మేమీది దాచం. రాఫేల్‌ ఒప్పందంలో ప్రజల సొమ్ము ఉన్నందు వల్ల తప్పకుండా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని సీతారామన్‌ తెలిపారు.

మొదటి నుంచి రాఫేల్‌ విమానాల డీల్‌ వివాదాస్పదంగానే ఉంది. కాంగ్రెస్‌ హయాంలో 126 రాఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు చర్చలు జరిగాయి. అందులో 18 ఎగిరేందుకు సిద్ధంగా విమానాలను అందజేయాలని ఉండగా, మిగతావాటిని డసాల్ట్‌ కంపెనీ సహకారంతో హిందుస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ తయారు చేయాల్సి ఉండింది. ఆ సమయంలో ఒక్కో ఫైటర్‌ జెట్‌ ఖరీదు 714 కోట్ల రూపాయలను లెక్కగట్టారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడంతో ఒప్పందం తుదిరూపు దాల్చలేదు.

మోదీ ప్రభుత్వం హయాంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు తాజాగా చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం కూడా కుదిరింది. రాఫేల్‌ విమానాల కొనుగోలుకు ఎంతవుతుందని లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు ప్రశ్నించినప్పుడు 2016, సెప్టెంబర్‌ 23వ తేదీన ఒక్కో జెట్‌కు 670 కోట్ల రూపాయలు అవుతుందని బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ లెక్కన మొత్తం 36 విమానాలకు దాదాపు 24వేల కోట్ల రూపాయలు కావాలి.

2015లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ మొత్తం ఒప్పందం విలువ 90 వేల కోట్ల రూపాయలని పార్లమెంట్‌కు తెలిపారు. అది తప్పని మొత్తం ఒప్పందం విలువ 58 వేల కోట్ల రూపాయలని, ఒక్కో విమానానికి 1063 కోట్ల రూపాయలవుతోందని ఆ తర్వాత ప్రభుత్వమే ప్రకటించింది. మొత్తం ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక్కో ఫైటర్‌కు 1640 కోట్ల రూపాయలు అవుతుందని ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

రాఫేల్‌ యుద్ధ విమానాలకు రోజుకో లెక్క చెబుతున్న నేపథ్యంలో అసలు లెక్కేమిటో చెప్పాల్సిందిగా ప్రతిపక్షం నిలదీస్తే రాజ్యాంగంలోని పదవ అధికరణం ప్రకారం గోప్యంగా ఉంచడం ప్రభుత్వ ధర్మం అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రజల సొమ్ముతో కొంటున్నందున ఒప్పందం విలువను తానే వెల్లడిస్తానని చెప్పిన మంత్రి సీతారామన్‌ మాట మార్చటంలో అర్థం ఉందా? పారదర్శకతకే ప్రాధాన్యమిస్తానంటున్న బీజేపీ ప్రభుత్వం ఈ ఒప్పందం విలువను వెల్లడించక పోవడం ఏమిటీ?

మరిన్ని వార్తలు