నిర్మలా సీతారామన్‌ భర్త సంచలన వ్యాఖ్యలు

14 Oct, 2019 17:57 IST|Sakshi

దేశ ఆర్థికమందగమనం, పరకాల ప్రభాకర్‌ కేంద్రంపై తీవ్ర విమర్శలు

వాస్తవ పరిస్థితిని అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు

 పీవీ, మన్మోహన్‌  సింగ్‌ విధానాలను  అనుసరించండి!

 సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగ సంక్షోభంపై  కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌  పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌ ఇందుకు  భిన్నంగా స్పందించారు.  ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులపై మండిపడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదన ఒప్పుకోవడానికి విముఖత చూపుతోందంటూ ‘ ది హిందూ’లో  ప్రచురించిన ఒక కాలమ్‌లో ఆయన బీజేపీ సర్కార్‌పై  తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార‍్హం..
 
ఒకదాని తరువాత ఒకటి పలు సెక్టార్లు తీవ్రమైన సవాళ్లును ఎదుర్కొంటుండగా, బీజేపీ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్న కారణాలను విశ్లేషించలేకపోతోందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాత్మక దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో పార్టీ థింక్ ట్యాంక్ కూడా విఫలమైందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించే ఒక చిన్న మార్గాన్ని కూడా  ప్రభుత్వం చూపలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మందగమనంపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం  కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖంగా లేదన్నారు. ప్రభుత్వం తిరస్కరణ మోడ్‌లో ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు "నెహ్రూ సోషలిజాన్ని విమర్శించటానికి" బదులుగా, ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గం సుగమం చేసిన రావు-సింగ్ ఆర్థిక నమూనాను బీజేపీ అవలంబించాలని సూచించారు. ఆ ఇద్దరు ప్రధానులూ (పీవీ నరసింహారావు, మన్‌ మోహన్‌ సింగ్‌) పాటించిన విధానాలు ఆర్ధిక సరళీకరణకు దోహదం  చేశాయనీ, ఈ విషయాన్ని గుర్తించి వాటిని పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు.

సీతారామన్‌ స్పందన
దీనిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించినప్పుడు 2014 నుండి 2019 వరకు ప్రాథమిక సంస్కరణలు అనేకం చేసామని జవాబిచ్చారు. జీఎస్టీ, ఆధార్, గ్యాస్‌ పంపిణీ లాంటి ఇతర ప్రజా ప్రయోజన పథకాలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని ఆమె ప్రశ్నించారు. దీంతోపాటు ఆర్ధిక వృద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు