నాడు ఇందిరా గాంధీ.. నేడు నిర్మల

31 May, 2019 18:23 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలిలో ఆర్థిక శాఖ ఎంతో కీలకమైనది. ఆ శాఖ బాధ్యతలు చేపట్టాలంటే ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతులై ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థపై మంచి అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా ఆ శాఖ మంత్రి సమర్థులై ఉండాలి. ఇప్పుడీ అవకాశం కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు ఈ అరుదైన ఘనత సాధించారు. శుక్రవారం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో.. అనుహ్యాంగా నిర్మలా సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో దేశ ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మల చరిత్ర సృష్టించారు. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970-71లో ఆర్థిక శాఖను ఆమె వద్దే అంటిపెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖను నిర్వహించిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. కాగా దేశ తొలి మహిళా రక్షణ శాఖమంత్రిగా కూడా నిర్మల రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

మోదీ గత కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌ జైట్లీ అనారోగ్య కారణంగా మంత్రి పదవి చేపట్టడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఆ అవకాశం నిర్మలా సీతారామన్‌ను వరించింది. తమిళనాడులో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నిర్మల అనంతరం.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌ పట్టాపొందారు. నిర్మలకు ఇంతకు ముందే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభం ఉంది. వాణిజ్య శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా కేంద్ర కేబినెట్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన నిర్మల.. రఫేల్‌ వివాదంలో ప్రధాని మోదీకి అండగా నిలిచారు. రక్షణ శాఖపై పార్లమెంటులో ప్రతిక్షాలు లేవనెత్తిన అంశాలపై ధీటైన సమాధానాలు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు