ఎన్నికల నిబంధనల్ని రాజీవ్‌ ఉల్లంఘించారు

6 Apr, 2019 04:26 IST|Sakshi
నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌

నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన్‌పై ఈసీ అసంతృప్తి  

న్యూఢిల్లీ: ‘న్యాయ్‌’ పథకంపై చేసిన విమర్శలకు నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. రాజీవ్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి అంశాలపై ఆచితూచి స్పందించాలని సూచించింది. ప్రభుత్వ అధికారులు నిష్పాక్షికంగా ఉండాలనీ, అది వారి ప్రవర్తనలో కన్పించాలని వ్యాఖ్యానించింది. రాజీవ్‌ విషయంలో అది కొరవడిందని చురకలు అంటించింది. నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత(న్యాయ్‌) కింద ఏటా రూ.72 వేలు అందిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడం తెల్సిందే. ఇలాంటి పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందన్న కుమార్‌ వ్యాఖ్యలపై ఈసీ పైవిధంగా స్పందించింది.

యోగికి ఈసీ మందలింపు
భారత సైన్యం మోదీ సేనగా పేర్కొన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఈసీ మందలించింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఎలాంటి శిక్ష విధించకుండానే వదిలిపెట్టినట్లు తెలిసింది. సీనియర్‌ నేత అయిన యోగి మాటలు ఆయన హోదాను ప్రతిబింబించేలా ఉండాలంది. ఆదివారం ఘజియాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడుతూ ‘ కాంగ్రెస్‌ నాయకులు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తారు. కానీ మోదీ సైన్యం తూటాలు, బాంబులతో బదులిస్తుంది’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు