నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

5 Feb, 2019 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీని అయోమయంలో పడేశారు. రాజు, ప్రభుత్వం, పరిపాలన సెక్యూలర్‌గా ఉండొచ్చు కానీ వ్యక్తి ఎప్పుడూ సెక్యులర్‌ కాలేడంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వధర్మ, సమభావనతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రాంత, భాష, జాతి, ధర్మం బేధంలేకుండా పరిపాలన సాగుతోందన్నారు. (గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!)

70 ఏళ్ళు అయిన సామాజిక అసమానతలు కొనసాగడానికి కారణం పాలకులేనని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక వివక్ష లేకుండా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని చారిత్రక నిర్ణయంగా వర్ణించారు. తప్పుడు పనులు చేస్తేనే కాదు.. మంచి అభివృద్ధి పనులు చేసినా ఎక్కువ మంది శత్రువులు పెరుగుతారని అర్థమయిందన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసే రాజకీయాలు జరుగుతాయని, జాగ్రతగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదని హామీలు నిలబెట్టుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు