నాపై భారీ కుట్ర జరుగుతుంది: గడ్కరీ

23 Dec, 2018 18:48 IST|Sakshi

న్యూఢిలీ​: తనపై భారీ కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలోని నాయకులు ఎన్నికల్లో ఓటమికి కూడా బాధ్యత వహించాలని తను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు, మీడియా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ అధిష్టానానికి, తనకు మధ్య చిచ్చు పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కొందరు ప్రతిపక్ష నేతలు, ఓ వర్గం మీడియా తన మాటలను వక్రీకరించేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు తను గమనించానని చెప్పుకొచ్చారు. బీజేపీని, తనను అపత్రిష్ట పాలు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వారి కుట్రలు సాగవని స్పష్టం చేశారు.

కాగా, మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఓటమిని, వైఫల్యాలను నాయకులు అంగీకరించాలని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించే గడ్కరీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు