‘నితీష్‌కుమార్‌ సీఎంగా ఉండాలనుకోవడం లేదు’

1 Nov, 2018 11:00 IST|Sakshi

2020 తర్వాత జేడీయూపై విముఖత ఏర్పడొచ్చు

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘2020 ఎన్నికల్లో బిహార్‌ ప్రజలు మరోసారి జేడీయూకి అధికారం ఇవ్వకపోవచ్చు. అందుకే తాను మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని నితీష్‌ అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితీషే కొన్ని నెలల క్రితం తనతో చెప్పాడు’ అని ఉపేంద్ర వెల్లడించారు. (మళ్లీ ఆయనే సీఎం: సర్వే)

15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మరో దఫా ఓటు వేసి గెలిపించక పోవచ్చునని నితీష్‌ తన మనసులో మాట బయటపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. నితీష్‌కుమార్‌, జేడీయూపై నేను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావని అన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉపేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్‌ భవిష్యత్‌పై ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన ఆర్‌ఎల్‌ఎస్పీ అధ్యక్షుడు కామెంట్లు చేయడంతో రాజకీయంగా ప్రాదాన్యత సంతరించుకుంది. (జేడీయూతో దోస్తి.. దిగొచ్చిన బీజేపీ)

కాగా, ఎన్డీయే కూటమిలో తిరిగి చేరిన జేడీయూకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లు త్యాగం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశాడు. క్రితం సారి ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీకి మూడు ఎంపీ స్థానాలు కేటాయించిన బీజేపీ ఈ సారి ఆ సంఖ్యను రెండుకు కుదించింది. ఈ నేపథ్యంలోనే అసహనంతో ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..పటేల్‌ జయంతి సభకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌తో ఉపేంద్ర భేటీ అయ్యారు.  అయితే, స్నేహపూర్వక భేటీలో భాగంగానే తేజస్వీని కలిసినట్టు ఉపేంద్ర వెల్లడించారు.

మరిన్ని వార్తలు