మీడియాకు దండం పెట్టిన బిహార్‌ సీఎం

24 Jan, 2020 21:21 IST|Sakshi

పట్నా : బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మీడియాపై అసంతృప్తిని ప్రదర్శించారు. శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్‌.. అక్కడ మీడియా ప్రతినిధులకు చేతులెత్తి నమస్కరించారు. కొద్ది రోజులుగా జేడీయూలో జరుగుతున్న పరిణామాలతో ఆయన ఈ విధంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మిత్ర పక్షమైన బీజేపీపై నితీశ్‌ చేసిన వ్యక్తిగత విమర్శలను..  జేడీయూ సీనియర్‌ నేత పవన్‌ వర్మ బహిరంగ లేఖలో ప్రస్తావించడాన్ని నితీశ్‌ తప్పుబట్టారు. తనకు సన్నిహితుడైన వర్మ ఇలా చేయడంపై ఆవేదన చెందినట్టుగా తెలుస్తోంది.

అయితే జేడీయూకు సంబంధించిన విభేదాలపై విస్తృత ప్రచారం జరగడంతో.. నితీశ్‌ తన కోపాన్ని మీడియాపై ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అలాగే వాళ్లు అనుకున్న దానినే ప్రచారం చేస్తారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తను పనిలో బిజీగా ఉంటాను కాబట్టి.. అలాంటి వారితో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని వర్మ జేడీయూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. అలాగే నితీశ్‌కు రాసిన లేఖను వర్మ ట్వీట్‌ చేశారు. అయితే వర్మ తీరును నితీశ్‌ తప్పుబట్టారు. వర్మ పార్టీ నుంచి మారాలనుకుంటే బయటికి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు