గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై స్పందించిన నితీష్‌ కుమార్‌

5 Jun, 2019 17:30 IST|Sakshi

పట్నా : ఇఫ్తార్‌ విందును ఉద్దేశిస్తూ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గిరిరాజ్‌ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే కాక.. జేడీయూ నాయకులు కూడా మండి పడుతున్నారు. ఈ క్రమంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ..  ‘మీడియాలో కనిపించడం కోసమే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వారి మాటలకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ప్రతి మతం ప్రేమ, గౌరవాలను బోధిస్తున్నాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ప్రత్యేకంగా ఓ మతమంటూ ఉండ’దన్నారు నితీష్‌.

బిహార్‌లో సీఎం నితీశ్‌ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్‌ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని ట్వీట్‌ చేశాడు. ఇది కాస్తా వివాదాస్పందగా మారడంతో అమిత్‌ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు