బదులు తీర్చుకున్న నితీశ్‌

3 Jun, 2019 04:08 IST|Sakshi
ప్రమాణస్వీకార కార్యక్రమంలో బిహార్‌ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ

జేడీయూకు చెందిన 8 మందికి మంత్రి పదవులు

ఎన్‌డీఏలోని బీజేపీ, ఎల్‌జేపీలకు మొండిచేయి

కూటమిలో విభేదాల్లేవన్న కేంద్ర మంత్రి పాశ్వాన్‌

పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్‌డీఏలోని బీజేపీ, ఎల్‌జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్‌జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ.. ఎన్‌డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

కేబినెట్‌ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్‌ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్‌ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్‌ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్‌ కేబినెట్‌లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్‌జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్‌ చంద్ర యాదవ్‌ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్‌జేపీ నేత పసుపతి కుమార్‌ పరాస్‌ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే.

నితీశే మా నేత: పాశ్వాన్‌
బిహార్‌లో ఎన్‌డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే తమ నేత అని ఎల్‌జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్‌లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్‌డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్‌డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్‌ కుమార్‌ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్‌లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్‌డీఏలోనే ఉంటా మంటూ నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్‌ తిరిగి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు