‘ప్రశాంత్‌ కిషోర్‌ను తప్పుపట్టలేం’

9 Jun, 2019 11:54 IST|Sakshi

మమత బెనర్జీతో పీకే భేటీపై నితీష​ కుమార్‌

పట్నా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే జేడీయూకి ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్‌ కిషోర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీ చర్చనీయాంశంగా మారింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో జేడీయూ కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా మమత కోసం పీకే పనిచేస్తున్నారంటూ బిహార్‌ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మమత-ప్రశాంత​ కిషోర్‌ భేటీపై నితీష్‌ కుమార్‌ తొలిసారి స్పందించారు.

‘‘దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా సలహాలు ఇవ్వడం ఆయన వృత్తి. ఇది పార్టీకి ఎలాంటి సంబంధంలేని అంశం.దీదీ, పీకే భేటీపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రశాంత్‌ కిశోర్‌ మా పార్టీ ఉపాధ్యక్షుడే. దాంతో పాటు ఎన్నికల వ్యూహరచన చేసే ఓ సంస్థకు అధిపతి కూడా. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఆయన బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని కలిసి ఉండొచ్చు. అంతేకానీ జేడీయూ కార్యకర్తగా పీకే అక్కడికి వెళ్లలేదు. కాబట్టి ఆయన్ను తప్పుపట్టలేం’ అంటూ వ్యాఖ్యానించారు. 

కాగా మమతతో పీకే ఇటీవల దాదాపు రెండు గంటలపాటు భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో కలిసి పని చేయాల్సిందిగా దీదీ.. పీకేను కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బెంగాల్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో సమావేశమయ్యి.. తమ పార్టీ కోసం పని చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు