మండే ఎండల్లో ఎన్నికలా..?

19 May, 2019 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే సుదీర్ఘంగా ఏడు దశల్లో పోలింగ్‌ జరపడం సరైంది కాదని బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు మండు వేసవి సరైన సమయం కాదని, ఎన్నికలను రెండు..మూడు దశల్లో ఫిబ్రవరి-మార్చి లేదా అక్టోబర్‌-నవంబర్‌లో నిర్వహించాలని ఈసీకి సూచించారు.

బిహార్‌ రాజధాని పట్నాలో రాజ్‌భవన్‌కు సమీపంలోని పోలింగ్‌ బూత్‌లో ఆదివారం ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను సుదీర్ఘంగా నిర్వహించడం, వివిధ దశల మధ్య భారీ గ్యాప్‌ అవసరం లేదని నితీష్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ సమయంపై సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే ఓ పార్టీ అధినేతగా తాను అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాస్తానని చెప్పారు.

దేశ ప్రయోజనం కోసం తాను ఈ సూచనతో ముందుకొచ్చానని, దీనిపై ఆయా పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే ఓటర్లకు మేలు జరుగుతుందని అన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల అనంతరం కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు