తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..

1 Jun, 2019 04:57 IST|Sakshi
శుక్రవారం పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న బిహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌

కేంద్ర మంత్రివర్గంలో చేరలేదన్న నితీశ్‌  

పట్నా/మీర్జాపూర్‌: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్‌ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్‌ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్‌ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్‌ పట్టుబట్టినట్లు సమాచారం.

లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్‌ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్‌ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్‌ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్‌ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అప్నాదళ్‌దీ అదే దారి..
మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్‌ (ఎస్‌) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్‌ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్‌ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  
 

మరిన్ని వార్తలు