నితీష్‌ చాలా స్వార్థపరుడు: బీజేపీ ఎంపీ

31 May, 2019 20:38 IST|Sakshi

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్ చాలా స్వార్థపరుడని బీజేపీ ఎంపీ గోపాల్ నారాయణ్ సింగ్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో జేడీయూకు ఒక మంత్రి పదవిని ఇవ్వాలని  బీజేపీ నిర్ణయించిందని, ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు మంత్రివర్గంలో చేరేందుకు తిరస్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించిందని తెలిపారు. నితీష్‌ నిర్ణయంతో తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడైన గోపాల్ నారాయణ్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ కేవలం తన ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారన్నారు. ఆయన చాలా స్వార్థపరుడని, తన సొంత ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

బీజేపీ మద్దతుతో ఏడేళ్ళపాటు బిహార్‌లో ప్రభుత్వాన్ని నితీష్‌ నడిపారని, పార్టీ కష్టకాలంలో బీజేపీని బయటకు తోసేశారని ఆయన విమర్శించారు. మంత్రి పదవుల కోసం మిత్ర పక్షాలేవీ కూడా నిరసనలు తెలియజేయడం లేదన్నారు. నితీష్‌ కుమార్ చర్యలను బిహార్ ప్రజలు చాలా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మోదీ కేబినెట్‌లో జేడీయూకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించగా.. దీని పట్ల నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా బిహార్‌లో 17 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 16 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి మంచి ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో కలిగిన మంత్రి పదవులను జేడీయూ ఆశించింది. అయితే ఒక్క మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆపార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ గత ప్రభుత్వంలో కూడా నితీష్‌ పార్టీ ఎలాంటి పదవులను చేపట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు