కవిత ఓటమికి కారణాలు అవేనా..!

23 May, 2019 21:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక తొలిరోజు నుంచే సంచలనం సృష్టించింది. నామినేషన్ల దగ్గర నుంచి ఇప్పుడు ఫలితాల విషయంలో కూడా దేశం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలను కోల్పోవడం ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ముఖ్యంగా సీఎం కుమార్తె  కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి చెందడం రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ.. కవితకు వ్యతిరేకంగా రైతులు పోటీ చేయడం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 68వేల పైచీలుకు ఓట్ల తేడాతే ఓటమిచెందిన విషయం తెలిసిందే.

ఆర్మూర్‌ ప్రాంతంలో పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. అంతటితో ఆగకుండా కవిత ఓటమే లక్ష్యంగా ఆమెకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేశారు. దీని ఫలితమే వారికి అనూహ్యంగా వారికి 90 వేలకు పైగా ఓట్లను తెచ్చిపెట్టాయి. లోక్‌సభ పరిధిలో రైతులకు దగ్గరి దగ్గరి లక్ష ఓట్లు రావడమనేది సామాన్యమైన విషయం కాదు. స్వయంగా సీఎం కూమార్తె పోటీచేస్తున్న స్థానంలో రైతులకు అన్ని ఓట్లు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడమే కాక.. జీవన్‌ రెడ్డి లాంటి సీనియర్‌ని ఓడిమి జగిత్యాలలో గులాబీ జెండాను ఎగరేయడంలో కవిత ముఖ్యపాత్ర పోషించారు. ఎన్నికలు గడిచి మూడు నెలలు కూడా ముగియకముందే ఫలితాలు అనూహ్యంగా మారాయి.  

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్లకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణకు చెందిన 24 మంది రైతులు నామినేషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన 787 ఓట్లు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు