ఏ1 కేంద్రం.. ఏ2 రాష్ట్ర ప్రభుత్వం

7 Apr, 2018 02:59 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ సంఘీభావం

ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ వెల్లడి 

వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు సంఘీభావం  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా పోవడంలో ఏ1 ముద్దాయి కేంద్రమైతే, ఏ2 ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమని ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హోదా కోసం వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న పోరాటంలో నిజాయతీ ఉందన్నారు. ‘‘సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై మూడుసార్లు యూటర్న్‌ తీసుకున్నారు.

2014 మే 26న కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రూ.లక్షల కోట్లు వచ్చి ఉండేవి. హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం రూ.లక్షల కోట్లు నష్టపోయింది. హోదా కోసం పోరాడితే కేసులు పెట్టారు. విభజన హామీల కమిటీ ఏర్పాటు చేయాలన్నాం. ఒక్క కమిటీ వేయలేదు. రూ.73,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని చెబితే ఒక్క రూపాయి కూడా రాబట్టుకోలేకపోయారు. కోర్టు చెప్పినా జరగలేదు. ప్రత్యేక హోదా సంజీవని కాదంటారు.

ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా ద్వారా దక్కించుకున్న కేటాయింపుల గురించి వివరించాం. అమరావతిని పారదర్శకంగా నిర్మించాలని అడిగితే అభివృద్ధి నిరోధకులు అంటున్నారు. మాట్లాడితే హేళన చేస్తారు. మేం బాలకృష్ణను విమర్శిస్తే లోకేశ్‌కు కోపం వస్తోంది. చంద్రబాబు ఇప్పటిదాకా పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారు. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి’’ అని చలసాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు