వేడెక్కిన పొత్తు రాజకీయాలు

6 Mar, 2019 04:26 IST|Sakshi
షీలాదీక్షిత్‌

ఢిల్లీలో ‘ఆప్‌’తో పొత్తు ఉండదు

ఒంటరిగానే పోటీ: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో ఎలాంటి పొత్తు ఉండదని, ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీచేస్తామని ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ షీలా దీక్షిత్‌ తెలిపారు. ‘మేం ఒంటరిగానే పోటీచేయాలని సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఆప్‌తో ఎలాంటి పొత్తూ ఉండదు’ అని మంగళవారం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీ పార్టీ నేతల సమావేశం అనంతరం షీలాదీక్షిత్‌ మీడియాతో చెప్పారు. ‘ఆప్‌తో పొత్తును రాహుల్‌ కూడా వ్యతిరేకించారు, ఇక మేం ఒంటరిగానే ప్రణాళిక రూపొందించుకుంటాం’ అని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

పార్టీ నాయకులతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. మెజారిటీ నేతల అభిప్రాయంతోనే వెళ్ళాలని, పార్టీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలని ఆయన నేతలను కోరారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తుందని షీలాదీక్షిత్‌ తెలిపారు. మూడు సీట్లు కాంగ్రెస్‌కి, మూడు ఆప్‌కి, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించేలా ఆప్‌ కాంగ్రెస్‌కు ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకుగాను ఆప్‌ ఆరు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఒంటరిగానే పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ నిర్ణయంపై ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని, వారిది అసహజ పొత్తుగా అభివర్ణించారు.

కూటమిలో కాంగ్రెస్‌ భాగమే: అఖిలేశ్‌
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తమ కూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగమేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ కోసం తమ కూటమిలో రెండు సీట్లు కేటాయించామని వెల్లడించారు.  మూడు నియోజకవర్గాలను కూటమిలో భాగంగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ)కి అప్పగించేందుకు ఎస్పీ–బీఎస్పీలు అంగీకరించాయి.  మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా, 37 చోట్ల ఎస్పీ, 38 చోట్ల బీఎస్పీ పోటీ చేస్తాయని గతంలోనే  పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, ఆయన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోమని ప్రకటించాయి. కాగా, ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు