చెప్పినా బెగ్గింగ్‌ అన్న కేంద్ర మంత్రి, వద్దన్న వెంకయ్య

29 Dec, 2017 18:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ఇకపై బెగ్గింగ్ అనే పదం వాడొద్దని చెప్పినా ఓ మంత్రి ఉపయోగించారు. దాంతో ఆ మంత్రి ప్రసంగం ప్రారంభిస్తుండగానే దయచేసి ఆ పదాన్ని ఉపయోగించకండి అని రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సూచించారు. సాధారణంగా రాజ్యసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో 'ఐ బెగ్‌ టూ'(నేను వేడుకుంటున్నాను) అని అంటుంటారు. అయితే, ఈ పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలోనే ఐ బెగ్‌ టూ అనే పదం వలసవాదానికి నిదర్శనం అని, ఇప్పుడు అందరం స్వతంత్ర్య భారతంలో జీవిస్తున్నామని, ఆంగ్లేయులు విడిచి వెళ్లిన ఆపదాన్ని విడిచి 'నేను లేవనెత్తుతున్నాను' అనే పదం ఉపయోగించాలని వెంకయ్యనాయుడు చెప్పారు.

అయితే, శుక్రవారంనాటి సమావేశంలో కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరీ 'ఐ బెగ్‌ టూ' అనే పదం ఉపయోగించారు. దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య ఆ పదం ఉపయోగించొద్దన్నారు. బహుషా తొలిరోజు సమావేశాల సమయంలో చౌదరీ లేకపోయి ఉండొచ్చని, అందుకే మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఎంపీలు ఎవరూ ఆ పదం ఉపయోగించవద్దని పునరుద్ఘాటించారు. వాస్తవానికి వెంకయ్యనాయుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ కూడా ఆ పదం ఉపయోగించలేదు.

మరిన్ని వార్తలు