పవన్‌ సీటుపై ఇంకా సందిగ్ధతే

19 Mar, 2019 05:23 IST|Sakshi

మూడో జాబితాలోనూ పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానం ప్రకటించని జనసేన

ఇప్పటి వరకు 77 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల వెల్లడి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం మొదలైనా ఇప్పటికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు. జనసేన పార్టీ ఇప్పటి వరకు మూడు జాబితాల్లో 77 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. మూడింటిలోనూ పార్టీ అధినేత పోటీ చేసే స్థానం ప్రస్తావన లేదు. విశాఖపట్నం జిల్లా గాజువాక, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ నేతలు మాత్రం పవన్‌ పోటీ చేసేందుకు ఏయే స్థానాలను పరిశీలిస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టడం లేదు. కాగా మంగళవారానికి పవన్‌ పోటీ చేసే స్థానంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన సోమవారం రాత్రి మూడో జాబితాను ప్రకటించింది. ఒక లోక్‌ సభ స్థానానికి, 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక మార్పు చేశారు.

గిద్దలూరు అభ్యర్థి షేక్‌ రియాజ్‌ను ఒంగోలు అసెంబ్లీ స్థానానికి మార్చారు. గిద్దలూరు నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన మూడో జాబితాలో పేర్కొన్నారు. ఒంగోలు లోక్‌సభ స్థానం అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబును ఎంపిక చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో టెక్కలి నుంచి కణితి కిరణ్‌కుమార్, పాలకొల్లు నుంచి గుణ్ణం నాగబాబు, గుంటూరు ఈస్ట్‌ నుంచి షేక్‌ జియా ఉర్‌ రెహమాన్‌; రేపల్లె నుంచి కమతం సాంబశివరావు, చిలకలూరిపేట నుంచి మిరియాల రత్నకుమారి, మాచర్ల నుంచి కె.రమాదేవి, బాపట్ల నుంచి పులుగు మధుసూధన్‌రెడ్డి, ఒంగోలు నుంచి షేక్‌ రియాజ్,  మార్కాపురం నుంచి ఇమ్మడి కాశీనాధ్, గిద్దలూరు నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్, పొద్దుటూరు నుంచి ఇంజా సోమశేఖర్‌రెడ్డి, నెల్లూరు అర్బన్‌ నుంచి కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి, మైదుకూరు నుంచి పందిటి మల్లోత్ర, కదిరి నుంచి సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు) పోటీ చేస్తారని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు