అక్కడ ప్రమాణం చేస్తే.. ఐదేళ్లు కష్టమే!

24 May, 2018 02:32 IST|Sakshi

కలసిరాని విధానసౌధ ప్రాంగణం

గతంలోనూ ఎన్నో ఘటనలు

సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు.  గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్‌ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదేఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణంచేసినా ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు. 1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జాలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు.

యడ్యూరప్పకూ చుక్కెదురే..
కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు.

మరిన్ని వార్తలు