కేజ్రీవాల్‌ ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం నో

14 Feb, 2020 04:11 IST|Sakshi
కేజ్రీవాల్‌ వేషధారణలో అవ్‌యాన్‌ తోమర్‌

న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆమ్‌ఆద్మీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం లేదు. ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎంలు, రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించడం లేదని ఆప్‌ ఢిల్లీ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ చెప్పారు. కేజ్రీవాల్‌ తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజల మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్‌ భావిస్తున్నారని వివరించారు.

ఏడాది బుడతడికి పిలుపు
అవ్‌యాన్‌ తోమర్‌ అనే చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఆప్‌ నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. కేజ్రీవాల్‌ మాదిరిగా టోపీ, స్వెట్టర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ ఏడాది వయస్సున్న ఈ బుడతడు ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడిరోజు అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బేబీ మఫ్లర్‌ మాన్‌’గా పేరొందిన తోమర్‌ తల్లిదండ్రులు ఆప్‌ కార్యకర్తలు.  

24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు ఆప్‌ వెల్లడించింది. పార్టీ సభ్యత్వం తీసుకోదలిచిన వారికోసం ఆ పార్టీ ఓ ఫోన్‌ నంబర్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. పార్టీలో జాయిన్‌ అవడానికి ఆ నంబర్‌కి మిస్డ్‌ కాల్‌ ఇస్తే సరిపోతుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు