నెగ్గిన అవిశ్వాసం..

2 Aug, 2018 12:55 IST|Sakshi

పదవి కోల్పోయిన రామగుండం మేయర్‌

విప్‌ ధిక్కరించిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు  

పంతం నెగ్గించుకొన్నఎమ్మెల్యే సోమారపు  

సాక్షి, పెద్దపల్లి: అధికార పార్టీకి చెందిన రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం గోదావరిఖనిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్‌లపై సొంత పార్టీ టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా 37 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు.

మరో ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఎంపీ బాల్క సుమన్, మేయర్‌ లక్ష్మీనారాయణ సహా 15 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 37 మంది సభ్యు లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి, జేసీ వనజాదేవి  ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించిన 13 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలకడం గమనార్హం.
 
పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు  
ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం దిగి వచ్చేటట్లు చేసి మేయర్‌ను పదవి నుంచి దించేశారు. సోమారపు, మేయర్‌ నడుమ గతేడాది నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. మేయర్‌కు ఎంపీ సుమన్‌ మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. వర్గపోరు ముదురు పాకాన పడటంతో గత నెల 6న మేయర్, డిప్యూటీ మేయర్‌లపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.

ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని మేయర్లందరూ కలసి సీఎం కేసీఆర్‌కు మొర పెట్టుకొన్నారు. దీంతో అవిశ్వాసాన్ని ఆపేయాలని సత్యనారాయణకు మం త్రి కేటీఆర్‌ ఫోన్‌ చేశారు. అధిష్టానంపై కినుక వహించిన సోమారపు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సం చలనం సృష్టించారు. అధిష్టానం దిగివచ్చి అవిశ్వాసంపై ఎమ్మెల్యేకే తుది అధికారాన్ని కట్టబెట్టడంతో అలకవీడి, మేయర్‌ను అవిశ్వాసంలో ఓడించి పంతం నెగ్గించుకొన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వర్గానికి జై కొట్టడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు