1 Jul, 2019 14:01 IST|Sakshi

బాధితులపైనే చార్జిషీట్‌ 

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో గోరక్షకుల దాడిలో మరణించిన పెహ్లూ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులపైనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఖండించిన విషయం తెల్సిందే. గోరక్షకుల పేరిట దేశంలో ఎక్కడా మూక దాడులు, హత్యలు జరిగినా తాము తీవ్రంగా ఖండిస్తామని, అలాంటి దాడులకు తమ పార్టీ పూర్తి విరుద్ధమని కూడా గెహ్లాట్‌ చెప్పారు. పెహ్లూ ఖాన్‌ విషయంలో ఆయన చెప్పిందీ పూర్తిగా అబద్ధం. 

2017, ఏప్రిల్‌లో గోమాంసం ఫ్రిజ్‌లో దాచుకున్నారన్న కారణంగా పెహ్లూఖాన్‌ ఇంటిపై గోరక్షకులు దాడిచేసి ఆయన్ని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బల కారణంగా రెండు రోజుల తర్వాత పెహ్లూఖాన్‌ మతిచెందారు. అప్పుడు స్థానిక పోలీసులు ఆయనపై ‘రాజస్థాన్‌ బొవైన్‌ యానిమల్స్‌ (ప్రొహిబిషన్‌ స్లాటర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ టెంపరరీ మైగ్రేషన్‌ ఆఫ్‌ ఎక్స్‌పోర్ట్‌) యాక్ట్‌–1995’  పెహ్లూఖాన్, ఆయన ఇద్దరి కుమారులపై కేసు పెట్టారు. హంతకులను వదిలిపెట్టి బాధితులపై కేసు దాఖలు చేయడం ఏమిటంటూ పత్రికల్లో, సోషల్‌ మీడియాలో గోల రేగడంతో రెండు రోజుల అనంతరం, అంటే ఏప్రిల్‌ ఐదవ తేదీన పెహ్లూఖాన్‌ మరణ వాంగ్మూలంలో పేర్కొన్న ఆరుగురు వ్యక్తులపై పోలీసులు హత్య కేసు దాఖలు చేశారు. వారిని అరెస్ట్‌ చేశారు. వారంతా బజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలు అవడంతో వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పటికీ స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. పెహ్లూ ఖాన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్‌ పార్టీ 2018, డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చింది. 

ఆ తర్వాతనే పోలీసులు పెహ్లూఖాన్, ఇద్దరు కుమారులపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇదే విషయమై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో అశోక్‌ గెహ్లాట్‌ ఖండించారు. ఇదే విషయమై అక్కడి స్థానిక పోలీసులను వాకబు చేయగా, చార్జిషీటు దాఖలు చేసేనాటికి పెహ్లూ ఖాన్‌ పేరు అందులో ఉండిందని, చనిపోయిన వ్యక్తి పేరును పెట్టడం భావ్యం కాదనే ఉద్దేశంతో తొలగించామని చెప్పారు. అయితే ఆయన ఇద్దరి కుమారుల పేర్లు ఇప్పటికీ ఉన్నాయని వారు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి జిల్లాకో గోరక్షణ శాలను ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కూడా నాటి బీజేపీ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్‌ పార్టీ వ్యవరిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు