ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ రెండూ ఒకటే

25 Dec, 2019 17:02 IST|Sakshi

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్‌) రెండూ ఒకటేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఎన్‌ఆర్‌సీ అమలుకు ఎన్‌పీఆర్ మొదటి మెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని వెల్లడించారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులతో పాటు బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన కలిశారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ అమలు చేయవద్దని కేసీఆర్‌ను ఆయన కోరారు. దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగింది.

అనంతరం అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విన్నపాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, రెండు రోజుల్లో పార్టీ నిర్ణయం చెబుతామన్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుదామని సూచించినట్టు చెప్పారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఈనెల 27న నిజామాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ఒక్క ముస్లింల సమస్య కాదని.. రాజ్యాంగం, ప్రాంతం సమస్య అని పేర్కొన్నారు. (ఎన్పీఆర్‌ వర్సెస్‌ సెన్సస్‌!)

ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ రెండూ వేర్వేరు అని అమిత్‌ షా చెప్పడంపై అసదుద్దీన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను అమిత్‌ షా తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మత పెద్దలు ముక్తి అజీముద్దీన్, రియాజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగా, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. (ఎన్‌పీఆర్‌ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?)

మరిన్ని వార్తలు