రియాక్షన్‌.. ‘ఇంక ఫోన్‌కాల్స్‌ చెయ్యను’

10 Jul, 2018 08:49 IST|Sakshi

ఎన్డీయేపై అసంతృప్తితో తిరిగి మహాకూటమితో జత కడదామనుకుంటున్న తరుణంలో జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాలూ కొడుకులు విముఖత వ్యక్తం చేయటంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయటం నితీశ్‌కు కోపం తెప్పించింది. 

పట్నా: లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్దకొడుకు, ఆర్జేడీ యువనేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నితీశ్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒకరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నప్పుడు.. వారి ఆరోగ్యం గురించి వాకబు చేయటంలో తప్పేంటి. అతని(తేజ్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యలు సబబు కాదు. ఎవరెలా బాధపడుతున్నా పట్టించుకోరనేది వారి మాటల ద్వారా అర్థమైంది. లాలూ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. కానీ, ఇంక వాళ్లకు ఫోన్‌ చేసి లాలూ ఆరోగ్యంపై ఆరా తీయను. న్యూస్ పేపర్ల ద్వారానే తెలుసుకుంటా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ఏషియన్‌ హార్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉంటే లాలూ ఆరోగ్యంపై నితీశ్‌ పదే పదే వాకబు చేస్తుండటంతో తిరిగి ఆర్జేడీకి లాలూ దగ్గరవుతున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌... ‘కూటమిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వం. మా ఇంట్లోకే నితీశ్‌ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేము.. మహాకూటమిలోకి ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారు?’ అని మీడియానే తేజ్‌ ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నితీశ్‌ ఇలా స్పందించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు