వారి హృదయంలో దళితులకు చోటులేదు

11 May, 2018 01:50 IST|Sakshi

మాతోనే అంబేడ్కర్‌ కలల సాకారం

శక్తివంతమైన, సుభిక్షమైన భారత్‌ను నిర్మిద్దాం

సమానత్వం, సామాజిక న్యాయమే మా లక్ష్యం

కన్నడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్‌ మోర్చాల ప్రతినిధులతో మోదీ

సాక్షి, బెంగళూరు: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కలలుగన్న శక్తివంతమైన, సుభిక్షమైన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఏనాడూ దళిత, బహుజన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్‌ మోర్చా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి నమో యాప్‌ ద్వారా ప్రధాని ప్రసంగించారు.

1952లో పార్లమెంటు ఎన్నికల్లో, 1953లో ముంబైలోని బాంద్రా లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ హృదయంలో దళితులు, ఓబీసీలకు చోటే లేదు. అంబేడ్కర్‌ను అవమానించినప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అమలుచేస్తోంది. కాంగ్రెస్‌ చేతిలో అధికారం ఉన్నంతవరకు అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు. బీజేపీ పగ్గాలు చేపట్టాకే ఆ మహనీయునికి సరైన గౌరవం దక్కింది’ అని మోదీ పేర్కొన్నారు.

దేశాభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న బాబాసాహెబ్‌ ఆలోచనలను నిజం చేసే దిశగా.. సమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అంబేడ్కర్‌ కలల సాకారం కోసం మనమంతా కృషిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు.ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ఎక్కువ మంది బీజేపీ వారేనని మోదీ గుర్తుచేశారు. స్వతంత్ర భారతంలో ఎస్టీలకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది వాజ్‌పేయి ప్రభుత్వమేనన్నారు.

అందుకే ఎస్టీలు ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, నాగాలాండ్, మేఘాలయల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతోందన్నారు. ఎస్టీలు బీజేపీ వెంటే ఉన్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. అటు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఏనాడూ ఆలోచించలేదని.. ఇప్పటికీ ఈ విషయం ముందుకు రాగానే కావాలని ఏదో ఒక ఆటంకాన్ని కలగజేస్తోందని మోదీ పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల మద్దతు ఎప్పటికీ బీజేపీకే ఉంటుందన్న ప్రధాని.. తమ పార్టీయే అల్పసంఖ్యాక వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

25 లక్షల మందితో మోదీ!
నమో యాప్‌ ద్వారా కర్ణాటకలోని 25లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ అనుసుంధానమయ్యారు. కర్ణాటక ప్రచారం సందర్భంగా పలు వీడియో సంభాషణల ద్వారా  ఇంత మంది ప్రజలతో ఆయన కనెక్ట్‌ అయ్యారని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంతమందితో అనుసంధానమైన తొలినేతగా మోదీ నిలిచారని పేర్కొంది. ఇప్పటికే నమో యాప్‌ ద్వారా పార్టీ మహిళ, యువజన, మైనార్టీ విభాగాలతో, రైతులతో మాట్లాడిన మోదీ.. తాజాగా పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్‌ మోర్చాలతోనూ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మోదీ మద్దతుదారులు కూడా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు మోదీ నమో యాప్‌ను బలమైన వేదికగా మార్చబోతున్నారని పార్టీ ఐటీ విభాగం నేత అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా