వైఎస్‌ జగన్‌ వస్తేనే ప్రత్యేక హోదా

9 Apr, 2019 12:41 IST|Sakshi

ప్రత్యేక హోదాకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు

130 సీట్లతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది

టీఆర్‌ఎస్‌కు 16, వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు 

మీట్‌ ది ప్రెస్‌లో ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌తోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 130 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయమని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పునరుద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌లో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆంధ్ర లో వైఎస్సార్‌సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయ దుందుభి మోగి స్తాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు 16, వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీలాగా తాను టానిక్‌ తాగి మాట్లాడడం లేదని, వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని బేరీజు వేసి చెబుతున్నానన్నారు. ఈ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. గతంలో కేంద్రంలో జాతీయ పార్టీలు బలంగా ఉండి ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం లభించేది కాదని, ప్రస్తుతం పరిస్థితులు మారా యన్నారు. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ముస్లింల ఊచకోతప్పుడు నోరు విప్పని బాబు
గుజరాత్‌లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల మంది ముస్లింలు ఊచకోతకు గురైతే అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కనీసం నోరు విప్పలేదని ఒవైసీ దుయ్యబట్టారు. అప్పట్లో తాను ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో గుజరాత్‌ సమస్యపై గళం విప్పితే నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా చిరునవ్వులు చిందించాడన్నారు. అప్పట్లో బీజేపీతో భాగస్వామిగా ఉండి వత్తాసు పలికేలా వ్యవహరిం చాడని విమర్శించారు. తిరిగి 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీతో చెట్టపట్టాలేసు కొని తిరిగి, కడుపునిండాక బీజేపీకి టాటా చెప్పాడని మండిపడ్డారు. అబద్ధాలు, మోసాల్లో బాబు నంబర్‌ వన్‌ అని, వెన్నుపోటు బాబుకు దారుణ ఓటమి తప్పదని హెచ్చరించారు. ఓటమి తప్పదని తెలిసి సహనం కోల్పోయి నోటికి అదుపు లేకుండా చెత్త భాష మాట్లాడుతున్నాడన్నారు.

మహిళకు రక్షణేది
మేనిఫెస్టోలో మహిళా సంరక్షణ బీజేపీతోనే అనడం అబద్ధమని ఒవైసీ చెప్పారు. జేఎన్‌యూలో మహిళలపై ఏబీవీపీ దాడులు చేసి రెండేళ్లు గడిచినా బీజేపీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇంకా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్నే మోదీ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారని, తామెవరికీ బీ టీమ్, సీ టీమ్‌ కాదని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు