‘మీ అహంకారంతోనే కూటమి కూలుతోంది’

29 Dec, 2018 11:15 IST|Sakshi

పట్నా: ఎన్డీయే కూటమిలోని నేతల అహంకారం కారణంగానే ఒక్కోపార్టీ కూటమి నుంచి బయటకు వస్తోందని బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ల వ్యవహారం సొంతపార్టీ నేతలకే నచ్చడంలేదని, వారి తీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా నిర్ణయమే దానికి నిదర్శనమని తేజస్వీ పేర్నొన్నారు. కుష్వాహా ఇటీవల ఎన్డీయే నుంచి బయటకు వచ్చి యూపీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే.

త్వరలోనే మరికొన్నిపార్టీలు కూడా వారికిదూరమవ్వడం కాయమని తేజస్వీ అభిప్రాయపడ్డారు. పట్నాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడలో బీజేపీ, జేడీయూ విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయకాబోయ్యే కూటమి గురించి ఆయన కూడా తేజస్వీ వివరించారు. ప్రస్తుతం తమ దృష్టింతా ప్రజల పక్షాన పోరాటమేనని, కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనే చర్చ ఇప్పుడు అనవసరమన్నారు.

బీజేపీకి అధికారం అప్పగించి ప్రజలంతా బాధపడుతున్నారని, మహిళలు, నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదుల తమ హక్కులు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తుకు, భారత రాజ్యాంగ రక్షణకు రానున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీని దించి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలను ఆయను గుర్తుచేశారు. మోదీ, అమిత్‌ షా లాంటి వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదకరమని తెలిపారు.

మరిన్ని వార్తలు