నేటి నుంచి ఢిల్లీలో నామినేషన్లు

16 Apr, 2019 10:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో మే 12న జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక్కటే ఏడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడలేదు. మరోపక్క కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై కూడా ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు రెండు పార్టీలు ప్రకటించినప్పటికీ బీజేపీని ఓడించడానికి పొత్తుకు సిద్ధమని రెండు పార్టీలు అంటున్నాయి. మోడీ, అమిత్‌ షా ద్వయాన్ని ఓడించడానికి దేనికైనా సిద్ధమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి ,అప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటున్నారు.

ఢిల్లీలో మూడు స్థానాల నుంచి కాంగ్రెస్, నాలుగు స్థానాల నుంచి ఆప్‌ పోటీ చేసేందుకు రెండు పార్టీలు అంగీకరించినప్పటికీ ఢిల్లీ ఆవల పొత్తు విషయమై రెండు పార్టీల వైఖరి వేర్వేరుగా ఉంది. ఢిల్లీతో పాటు తమకు గోవా, పంజాబ్, హరియాణాలలోనూ తమకు సీట్లు ఇవ్వాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తోంది. ఢిల్లీలో మాత్రమే పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్‌ అంటోంది. ఆప్‌తో పొత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఢిల్లీ నగరంలోని ఏడు సీట్లలో నాలుగింటికి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆప్‌తో పొత్తు కుదరని పక్షంలో మిగతా మూడు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదు.

మరిన్ని వార్తలు